ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన అంశాలను గుర్తించేందుకు గట్టి మేధోమథనం తర్వాత, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో BRS కనీసం ఆరు పార్లమెంటరీ నియోజకవ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన అంశాలను గుర్తించేందుకు గట్టి మేధోమథనం తర్వాత, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో BRS కనీసం ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. తుది నిర్ణయం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోనుండగా, పలువురు అభ్యర్థులకు మళ్ళీ టిక్కట్లు ఇవ్వవద్దని మెజారిటీ నేతలు ఇప్పటికే పార్టీ నాయకత్వానికి సూచించారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పటిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు, పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు బీఆర్‌ఎస్ జనవరి 3 నుంచి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు అన్ని నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నేతలతో కలిసి పార్టీ ఓటమికి దారితీసిన ప్రతి అంశాన్ని బహిరంగంగా చర్చించారు.
సమర్థవంతమైన కమ్యూనికేషన్, సమన్వయంతో పాటు పార్టీ క్యాడర్‌కు అగ్ర నాయకత్వం అందుబాటులో లేకపోవడాన్ని కూడా అంగీకరించారు. ఇలాంటి తప్పులు పునరావృతం చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. ఈ పరిస్థితులలో కొంత మంది అభ్యర్థులను మార్చాలని మెజారిటీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేని అభ్యర్థులకు టికెట్ నిరాకరించేందుకు వెనుకాడవద్దని పలువురు నేతలు పార్టీ నాయకత్వాన్ని అభ్యర్థించినట్లు తెలిసింది.
అగ్రనాయకత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉందని, దానిని క్రోడీకరించి పార్టీ అధ్యక్షుడికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞులైన నాయకులు , కొత్త ముఖాల కలయికతో పాటు సీట్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ నాయకులు సూచించినట్లు సమాచారం.
“మునుపటిలా కాకుండా, లోక్‌సభ టిక్కెట్ల కోసం అనేక మంది పోటీదారులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కొంతమంది సిట్టింగ్ అభ్యర్థుల పేలవమైన పనితీరు వల్ల అభ్యర్థుల మార్పు డిమాండ్ ఊపందుకుంది. మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు అభ్యర్థులను మార్చే అవకాశాలు పార్టీ అధినాయకత్వం సీరిఅయస్ గా ఆలోచిస్తోంది’’ అని బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త ఒకరు అన్నారు.
మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో, BRS సాంప్రదాయకంగా హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని AIMIMకి వదిలివేస్తుంది. మిగిలిన స్థానాల నుండి, పార్టీ తన తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలలో ఏడుగురికి , 2019 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన ఏడుగురు అభ్యర్థులలో నలుగురికి మళ్లీ టిక్కట్ ఇచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర అసెంబ్లీకి సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన మెదక్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మార్చేందుకు అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత ఆసక్తిగా ఉన్నందున అటువంటి తక్షణ ప్రణాళికలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇతర సిట్టింగ్ ఎంపీలలో నామా నాగేశ్వరరావు, బిబి పాటిల్, జి రంజిత్ రెడ్డి, బి వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పి రాములు, పసునూరి దయాకర్, కవితా మాలోత్ ఉన్నారు. వీరిలో స్థానిక కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎంపీల్లో ఒకరినైనా మార్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీలు గోడం నగేశ్, కరీంనగర్ నుంచి బీ వినోద్‌కుమార్, నిజామాబాద్ నుంచి కే కవిత పోటీ చేసే అవకాశం ఉంది. 2019 ఎన్నికల సమయంలో మర్రి రాజశేఖర్ రెడ్డి (అసెంబ్లీకి ఎన్నికైనారు) . మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో తాజా ముఖాలను ఎన్నుకోవచ్చు. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో కొత్తల అభ్యర్థుల కోసం బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది.
కేసీఆర్ అనారోగ్యం నుండి త్వరగా కోలుకొని ఫిబ్రవరి రెండవ వారం నుండి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో అప్పుడే అన్ని అవకాశాలను పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.