ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెన్నైలోని రాయపేటలో ఆమెకు చెందిన ఓ సినిమా థియేటర్ ఉద్యోగులు
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెన్నైలోని రాయపేటలో ఆమెకు చెందిన ఓ సినిమా థియేటర్ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించడమే కాక రూ.5 వేల జరిమానా కూడా విధించింది కోర్టు.
జయప్రద చెన్నైలోని రాయపేటలో గతంలో ఓ థియేటర్ నిర్వహించారు. చాలా కాలం మంచి లాభాలు గడించిన ఆథియేటర్ కు ఆ తర్వాత రాబడి తగ్గడంతో మూసి వేశారు. ఈ థియేటర్ ను చెన్నైకి చెందిన రామ్‌కుమార్, రాజబాబు నిర్వహించేవాళ్ళు. థియేటర్ నడిచిన కాలంలో కార్మికుల నుండి యాజమాన్యం ఇఎస్ఐ వసూలు చేసింది. అయితే థియేటర్ మూసేసిన తర్వాత ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదు.
దీంతో కార్మికులు బీమా కార్పోరేషన్ ను ఆశ్రయించారు. ఆ కార్పోరేషన్ యాజమాన్యంపై ఎగ్మోర్ కోర్టులో కేసు వేశారు. దీనికి వ్యతిరేకంగా జయప్రద హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు ఆమె పిటిషన్ ను తిరస్కరించింది. ఆ తర్వాత తాను కార్మికుల ఇఎస్ఐ డబ్బులు పూర్తిగా చెల్లిస్తానని కోర్టుకు చెప్పినప్పటికీ కోర్టు ఒప్పుకోలేదు.
ఇరు పక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ కోర్టు జయప్రదతోపాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు.