ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం చంద్రబాబుతో అలాంటి చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మరో సారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడుగా ఉన్న కాంగ్రెస్ కూడా అధికారం కోసం తహతహ లాడుతోంది. రాహుల్ గాంధీ సభతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది. త్వరలోనే కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ నాయకులను ఎన్నికల కోసం సిద్ధం చేస్తోంది. పార్టీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ అధిష్టానం గమనిస్తోంది. త్వరలోనే అమిత్ షా బహిరంగ సభ కూడా ఉంటుందని తెలుస్తున్నది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి. మెజార్టీ నియోజకవర్గాల్లో ద్విముఖ పోరే ఉంటుందని.. త్రిముఖ పోరు చాలా తక్కువే అనే అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నికలు అనగానే తాము కూడా ఉన్నామంటూ తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ కాస్త ప్రభావం చూపింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పార్టీకి సరైన నాయకుడు కూడా లేరు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరు అంటూ వెంటనే సమాధానం కూడా చెప్పడం కష్టమే. అయినా సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పోటీలో ఉన్నామనే ప్రచారానికి టీడీపీ తెరతీసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 3వ వారం నుంచి టీడీపీ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఇటీవల ముఖ్య నేతల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సమావేశం అయ్యారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండాలనే విషయంపై చర్చించడంతో పాటు.. 9 కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28, 29 (శుక్ర, శని).. రెండు రోజుల పాటు బస్సు యాత్రపై వర్క్ షాప్ కూడా నిర్వహించనున్నారు.
కాగా, టీడీపీ అకస్మాతుగా బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఎందుకు నిర్ణయించిందనే విషయం అంతుబట్టడం లేదు. ఇప్పుడు టీడీపీకి ఒంటరిగా గెలిచే సత్తా కూడా లేదు. గట్టిగా మాట్లాడితే.. ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. మరి ఆ పార్టీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని అనుకుంటుందో అర్థం కాక కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు. గత ఎన్నికల సమయంలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇతర చిన్నాచితక పార్టీలను చంద్రబాబు ఏకం చేశారు. దీని వల్లే టీడీపీ ప్రభావం చూపగలిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఈ సారి కాంగ్రెస్-టీడీపీ కలిసే అవకాశమే లేదు. అధికార బీఆర్ఎస్‌కు టీడీపీకి అసలు పొసగదు. కమ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డాయి. మరి టీడీపీ వల్ల ఎవరికి లాభం అనే చర్చ జరుగుతున్నది.
ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం చంద్రబాబుతో అలాంటి చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఇటీవల బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు కలిసినప్పుడు కేవలం తెలంగాణకు సంబంధించిన విషయాలే చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది. తెలంగాణలో బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేయాలని కోరినట్లు సమాచారం. అయితే, ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో.. ముందుగా తెలంగాణలో బీజేపీతో కలిసి ప్రయాణించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును మళ్లీ సాధించాలనే లక్ష్యంతోనే బాబు డైరెక్షన్‌లో ఈ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల లోపు కాస్త ప్రజల్లో ఉంటే.. ఆ తర్వాత బీజేపీతో జట్టు కట్టి.. మళ్లీ ఒకటో రెండో సీట్లు సాధించాలని టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ కూడా టీడీపీ ఓటు బ్యాంకు ద్వారా అయినా కొన్ని సీట్లు ఖాతాలో వేసుకోవచ్చని అంచనా వేస్తోంది. అందుకే ముందుగా టీడీపీ బస్సు యాత్రకు తెరలేపిందని.. ఎన్నికల సమయానికి బీజేపీతో జట్టు కట్టడం ఖాయమనే చర్చ జరుగుతున్నది.