యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు జిట్టాబాలకృష్ణా రెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే క
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు జిట్టాబాలకృష్ణా రెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు బీజేపీ ప్రకటించింది.
జిట్టా బాలకృష్ణా రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని టీఆరెస్ తో ప్రారంభించారు. 2019 లో టీఆరెస్ , టీడీపి పొత్తు కారణంగా ఆయనకు ఎమ్మెల్యే టికట్ లభించకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బైటికి వచ్చి కొంత కాలం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒంటరిగానే పోరాడారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు. అనంతరం ఆయన యువ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం తన పార్టీని ఆయన బీజేపీలో విలీనం చేశారు.
అయితే బాలకృష్ణా రెడ్డి బీజేపీలో అన్యమనస్కంగానే ఉన్నారు. ఆయన ఆ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. బీజేపీలో వర్గ రాజకీయాలు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తదితర పరిణామాలతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారనే వార్తలు వినవచ్చాయి. చాలా కాలంగా ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తాను మానసికంగా కమలం పార్టీకి ఎప్పుడో దూరమయ్యానని చెప్పారు. కాంగ్రెస్ నుండి ఆహ్వానం అందినట్లు తెలిపారు. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను బీజేపీలో కార్యకర్తగా మాత్రమే ఉన్నానని, బీజేపీలో గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమాకాంక్షలు నెరవేస్తారని బిజెపిలో చేరానని.. తెలంగాణ ఆకాంక్ష బిజెపితో నెరవేరదని అర్థమయిందని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అబద్ధాలు చెప్తే నమ్ముతారేమో కానీ ఇక్కడ నమ్మరన్నారు .
బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనంటూ ఆరోపించిన జిట్టా 16 నెలలగా బిజెపిలో ఉన్నప్పటికీ తనను ఏ ఒక్క కార్యక్రమం చేయనివ్వలేదని మండిపడ్డారు.