సముద్ర మట్టానికి 630 అడుగుల ఎత్తులో.. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల మేర వైశాల్యంలో ఈ హిల్ స్టేషన్‌ను అభివృద్ధి చేశారు.
మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో నిర్మించిన లవాసా సిటీ అనే హిల్ స్టేషన్‌ను రూ.1,814 కోట్లకు ఒక ప్రైవేటు సంస్థ కొనుగోలు చేసింది. గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం పూణే సమీపంలోని ఒక హిల్ స్టేషన్‌ను అమ్మకానికి పెట్టింది. హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ) అనే సంస్థ అక్కడ హిల్ స్టేషన్ కోసం భారీగా సొమ్ము చెల్లించి కొనుగోలు చేసింది. ఇటలీలోని పోర్టోఫినో అనే పట్టణాన్ని స్పూర్తిగా తీసుకొని పూణే సమీపంలో లవాసా సిటీని నిర్మించారు. అయితే హెచ్‌సీసీ కంపెనీ ఈ హిల్ స్టేషన్ నిర్మాణం కోసం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించిందని, నిధుల సమీకరణకు అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో హెచ్‌సీసీ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం లవాసా సిటీని జప్తు చేసుకుంది.
హెచ్‌సీసీ నుంచి ఈ ప్రైవేట్ హిల్ స్టేషన్‌ను ముంబైకి చెందిన డార్విన్ ప్లాట్‌ఫామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు బదిలీ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) తాజాగా తార్పు చెప్పింది. హెచ్‌సీసీ నుంచి బదిలీ చేసే క్రమంలో డార్విన్ ప్లాట్‌ఫామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 2021 డిసెంబర్‌లో ఫైనాన్షియల్ బిడ్లను గెలుచుకున్నది. అయితే కొన్ని వివాదాల కారణంగా డార్విన్ గ్రూప్‌కు టెండర్ అప్పగించలేదు.
ఈ క్రమంలో లవాసా కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (గతంలో అప్పులు ఇచ్చిన బ్యాంకులు, సంస్థలు) డార్విన్ బిడ్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. డార్విన్ సంస్థ దశల వారీగా చెల్లిస్తామని చెప్పిన రూ.1,814 కోట్ల ప్లాన్‌కు అమోద ముద్ర వేశాయి. దీంతో ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ డార్విన్ సంస్థకే ఆ ప్రైవేట్ హిల్ స్టేషన్ హక్కులను కట్టబెట్టింది.
ఈ హిల్ స్టేషన్‌లో కొత్తగా ఒక పట్టణాన్ని నిర్మించనున్నారు. అనేక వీధులు, ప్రీమియర్ లగ్జరీ విల్లాలతో కూడిన ఈ పట్టణం.. విదేశాల్లో ఉండేలా నిర్మించనున్నారు. ఇప్పటికే దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలోనే హిల్ స్టేషన్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 630 అడుగుల ఎత్తులో.. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల మేర వైశాల్యంలో ఈ హిల్ స్టేషన్‌ను అభివృద్ధి చేశారు.