HomePoliticsNational

చీమను చంపడానికి సుత్తిని వాడతారా… ఫేక్ న్యూస్ పై ప్రభుత్వ రూల్స్ అతిగా ఉన్నాయన్న‌ హైకోర్టు

చీమను చంపడానికి సుత్తిని వాడతారా… ఫేక్ న్యూస్ పై ప్రభుత్వ రూల్స్ అతిగా ఉన్నాయన్న‌ హైకోర్టు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ వ్యాపిస్తోందని అందుకోసం ప్రభుత్వం ఇటీవల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) నిబంధనలను సవరించింది. అయిత

నీళ్ళడిగిన పాపానికి దివ్యాంగుడిని అన్యాయంగా చితకబాదిన జవాన్లు
సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న AI కేసీఆర్
ఆ గుర్తున్న‌ రూ.500 నోట్లు నకిలీవా ?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ వ్యాపిస్తోందని అందుకోసం ప్రభుత్వం ఇటీవల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) నిబంధనలను సవరించింది. అయితే ఆ నిబంధనలు మితిమీరి ఉన్నాయని, చీమను చంపడానికి ఎవరైనా సుత్తిని వాడుతారా? అని బాంబే హైకోర్టు శుక్రవారం ప్రశ్నించి‍ంది.

ఈ నిబంధనల సవరణ వెనుక ఆవశ్యకత తమకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని, నకిలీ, అబద్ధం ఏది అని నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక అధికారికి సంపూర్ణ అధికారం ఇవ్వడం కష్టమని న్యాయమూర్తులు గౌతమ్ పటేల్, నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.

ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఒక పౌరుడిలాగే ప్రభుత్వం కూడా భాగస్వామి అని, అందువల్ల ప్రశ్నించడం, సమాధానాలు కోరడం ఒక పౌరుడికి ప్రాథమిక హక్కు అని, పౌరుడి ప్రశ్నలపై ప్రభుత్వానికి ప్రతిస్పందించాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది.
సవరించిన ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్‌లు నిబంధనలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అవి ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాయి. అవి పౌరుల ప్రాథమిక హక్కులపై వ్యతిరేక‌ ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది.

సవరించిన నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయనున్న ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ (FCU)ని ఎవరు తనిఖీ చేస్తారని కోర్టు ప్రభుత్వ అడ్వకేత్ ను ప్రశ్నించింది.

“FCU చెప్పేది కాదనలేని అంతిమ సత్యం కాదు” అని జస్టిస్ పటేల్ అన్నారు.

ప్రభుత్వం విధించిన ఐటి నిబంధనలకు వ్యతిరేకంగా శుక్రవారం, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్ తరపున న్యాయవాది గౌతమ్ భాటియా తన వాదనలు వినిపించడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్‌కు చెక్ పెట్టడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయని భాటియా కోర్టుకు తెలిపారు.

ఆఫ్‌లైన్ కంటెంట్‌లో కొంత వడపోత ఉందని, అయితే ప్రస్తుతం సోషల్ మీడియా కోసం అలాంటి వాస్తవ తనిఖీ లేదని బెంచ్ పేర్కొంది.

“కొంతవరకు నిజానిజాలను తనిఖీ చేయాలి. ఏదో ఒక స్థాయిలో, ఎవరైనా తప్పనిసరిగా సోషల్ మీడియాలో కంటెంట్‌ని తనిఖీ చేయాలి. అయితే ప్రభుత్వ ఐటీ రూల్స్ మితిమీరి ఉన్నాయని మీరు (పిటిషనర్లు) చెప్పడం సరైనదే కావచ్చు. చీమను చంపడానికి ఎవరూ సుత్తిని తీసుకురారు. ”అని కోర్టు పేర్కొంది.

నిబంధనలు మితిమీరాయన్న‌ అంశాన్ని పక్కన పెడితే, ఐటీ నిబంధనలకు ఈ సవరణ ఎందుకు అవసరంమో ఇంకా మేము అర్థం చేసుకోలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొంది.

“ఈ సవరణ అవసరమేంటి ? ప్రభుత్వానికి అంత‌ ఆందోళన ఎందుకు? దాని వెనుక ఉన్న ఆత్రుత ఏమిటి? నాకు ఇంకా అర్దం కావడం లేదు” అని జస్టిస్ పటేల్ అన్నారు.

అబద్ధాలు చెప్పడం ప్రాథమిక హక్కు అని ఏ వ్యక్తి కూడా క్లెయిమ్ చేయడం లేదని., ఒక పౌరుడు చెబుతున్నవారి వాంగ్మూలాన్ని సమర్థించుకునే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది.

ధర్మాసనం పౌరసత్వ చట్టాన్ని ప్రస్తావిస్తూ, “ఈ చట్టంలోని నిబంధనలు తప్పని ఎవరైనా అభిప్రాయాన్ని వ్రాస్తే, అటువంటి వ్యతిరేక అభిప్రాయాన్ని నకిలీ, తప్పుడు, తప్పుదోవ పట్టించేదిగా ఆదేశించవచ్చా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన అథారిటీ ఏది నిజమో, ఏది నకిలీదో అంతిమంగా ఎలా నిర్ణయించగలదని కూడా కోర్టు అడిగింది.

“ఇది నకిలీ, ఇది తప్పుదారి పట్టించేది అని నిర్ణయించడానికి రూల్స్ ఫాక్ట్ చెకింగ్ యూనిట్‌కు సంపూర్ణ శక్తిని ఇవ్వడం నాకు కష్టంగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం, న్యాయస్థానం తప్ప, దేన్నైనా నిజం, అబద్ధం అని ఉచ్చరించే అధికారం ఎవరికీ లేదు. న్యాయస్థానం కూడా బహుశా ఇది నిజం కావచ్చు, ఇది అబద్ధం కావచ్చు అని మాత్రమే చెబుతుంది, ”అని బెంచ్ పేర్కొంది.

ప్రభుత్వం వద్ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఉందని, ఏదైనా తప్పుడు లేదా నకిలీ కంటెంట్ ఉన్నపుడు సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుందని, అలాంటప్పుడు ఈ సవరణలు ఎందుకని కోర్టు పేర్కొంది.

ఈ ఏడాది ఏప్రిల్ 6న, కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021కి కొన్ని సవరణలను ప్రకటించింది.

సవరించిన నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, నిబంధనల ప్రకారం ఏ వ్యక్తికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మూడు పిటిషన్లు కోర్టును కోరాయి.